: ఫ్యాక్షన్ రాజకీయాలకు వైయస్ కుటుంబమే నాంది.. ఎన్టీఆర్ కూడా ఇబ్బంది పడ్డారు: చంద్రబాబు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జరిగిన ఫ్యాక్షన్ హత్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. హత్యారాజకీయాలను, ఫ్యాక్షన్ హత్యలను వైయస్ కుటుంబమే ప్రోత్సహించిందని ఆరోపించారు. వైయస్ రాజారెడ్డి, జగన్ లు ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించారని విమర్శించారు. ఇలాంటి హత్యా రాజకీయాలకు టీడీపీ వ్యతిరేకమని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఆలాంటి రాజకీయాల పట్ల ఇబ్బంది పడ్డారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు తాను 16 సార్లు వచ్చానని... ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. కాంక్రీట్ పనుల్లో వేగం మరింత పెరగాలని... 2018 నాటికి అనుకున్న విధంగానే నీటిని అందిస్తామని తెలిపారు. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. జూన్ 1 నుంచి గోదావరి కాల్వలకు నీటిని విడుదల చేస్తామని... తుపాన్లకు ముందే పంట చేతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పులిచింతల నీటితో కృష్ణా డెల్టాలోని మొదటి పంటకు నీటిని అందిస్తామని వెల్లడించారు.