: రజనీకాంత్ దిష్టిబొమ్మ దగ్ధం.. తలైవాకు తమిళ సెగ!
తమిళనాట సూపర్ స్టార్ గా, రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతున్న రజనీకాంత్... తాను కూడా తమిళుడినే అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు అక్కడ ప్రకంపనలు పుట్టిస్తోంది. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేకెత్తించాయి. అయితే రజనీ రాజకీయాల్లోకి రావద్దని డిమాండ్ చేస్తూ తమిళ భాష, సాంస్కృతిక సంఘాలు, ఇతర కొన్ని తమిళ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వీరంతా రజనీకాంత్ స్థానికతను లేవనెత్తుతున్నారు.
మరాఠా మూలాలున్న రజనీకాంత్ కొన్నేళ్లు కర్ణాటకలో కూడా ఉన్నారని వారు అంటున్నారు. రజనీ తమిళుడే కాదని నినదిస్తూ, రజనీ ఇంటి ముందు తమిళ సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతేకాదు, తమిళనాడులోని పలు ప్రాంతాలకు కూడా ఈ ఆందోళనలు పాకాయి. రజనీ పొలిటికల్ ఎంట్రీని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. కోయంబత్తూరులో రజనీ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. రానున్న రోజుల్లో ఈ నిరసనలు మరింత ఎక్కువయ్యే అకాశం ఉన్నట్టు తెలుస్తోంది.