: చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు: ఎంపీ బుట్టా రేణుక
టీడీపీ అధినేత చంద్రబాబు అండతోనే ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి హత్యకు గురికావడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ, నిన్ననే ఆయన్ని ఆప్యాయంగా పలకరించానని, ఈ నెలలో జరగనున్న పార్టీ ప్లీనరీ గురించి చర్చించామని చెప్పారు. నారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అని, అందుకే అదను చూసి ఆయన్ని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఆ పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసుల గురించి ఆమె ప్రస్తావిస్తూ, రాజకీయ పార్టీ నాయకుల కదలికలపై పోలీసులకు సమాచారం ఉంటుందని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు.