: నారాయణరెడ్డి హత్య ఇలా జరిగింది!
కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డిని పక్కా పథకం ప్రకారం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి, వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య ఎలా జరిగిందంటే... నంద్యాలలో సూర్యనారాయణరెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన నారాయణరెడ్డి, ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తన కారులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామ శివారులో కల్వర్టు వద్ద వాహనం స్లో అయింది. సరిగ్గా అక్కడే కాపు కాసి ఉన్న ప్రత్యర్థులు ట్రాక్టర్లతో కారును ఢీ కొట్టారు. కారులో నుంచి నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని బయటకు లాగి వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. అంతకుముందు, ప్రత్యర్థులు బాంబులు విసిరినట్టు సమాాచారం. కాగా, నారాయణరెడ్డి తన గన్ లైసెన్స్ రెన్యువల్ చేయాల్సిందిగా ఎన్నిసార్లు విన్నవించుకున్నా పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు తలెత్తాయి. దీంతో, ఆయన వద్ద ఆయుధం లేకుండా పోయిందని నారాయణరెడ్డి వర్గీయులు అంటున్నారు.