: తేజ నన్ను అంత మాట అనేసరికి మౌనంగా వెళ్లిపోయా!: ఆర్పీ పట్నాయక్
టాలీవుడ్ లోని సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ లో డైరెక్టర్ తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ లది కూడా ఒక కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’, ‘నిజం’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వీరిద్దరిదీ విడదీయలేని అనుబంధం అంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ మధ్య చోటుచేసుకున్న అవమానకరమైన సంఘటనను ఆర్పీ పట్నాయక్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... అప్పటికే తేజాతో కలసి కొన్ని చిత్రాలకు పనిచేసిన ఆర్పీ పట్నాయక్.. ఆయన దర్శకత్వంలోనే ఉదయ్ కిరణ్ హీరోగా రూపొందిన 'ఔనన్నా కాదన్నా' సినిమాకు కూడా పనిచేశాడు. అయితే... ఈ సందర్భంగా తేజ అన్న మాట తననెంతో బాధించిందని, తన జీవితంలో తాను అత్యంత బాధపడిన సంఘటనల్లో అది ఒకటని ఆర్పీ చెప్పారు. తాను సాధారణంగా ఏ నిర్మాత దగ్గర కూడా రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టుబట్టనని అన్నారు. వారు ఎంతిస్తే అంతే తీసుకునే వాడినని చెప్పారు.
అయితే ‘ఔనన్నా కాదన్నా’ నిర్మాత మాత్రం తనకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని, దీంతో ఈ విషయం తాను తేజకి చెప్పానని అన్నారు. ఆయన వెంటనే ‘ప్రస్తుతం మీ స్టేజ్ ఏంటో మీరు తెలుసుకోండి’ అని జవాబిచ్చాడని, దీంతో తాను షాక్ తిన్నానని చెప్పాడు. చాలా బాధనిపించడంతో మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ, ఇప్పటికీ తేజగారితో తనకు మంచి అనుబంధమే ఉందని ఆయన తెలిపారు.