: మళ్లీ రంజుగా మారిన తమిళ రాజకీయం.. సీఎం పళనిపై 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు?


జయలలిత మృతి తర్వాత  రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. పార్టీలో శశికళ కాలు మోపిన తర్వాత కీలక  పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ శశికళ, పన్నీర్ వర్గంగా చీలిపోయింది. ఇటీవల మళ్లీ విలీన వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే పన్నీర్ డిమాండ్లకు పళని వర్గం ససేమిరా అనడంతో అవి అక్కడే ఆగిపోయాయి. తాజాగా పళని వర్గానికి చెందిన 13 మంది దళిత శాసనసభ్యులు ముఖ్యమంత్రిపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రభుత్వంలో దళిత వర్గానికి ప్రాధాన్యం కల్పించాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న వీరు రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల తిరుగుబాటు వార్తల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి కేంద్రం నుంచి పిలుపు అందింది. గురువారం రాత్రే ఢిల్లీ వెళ్లిన ఆయన నేడు (శుక్రవారం) సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పన్నీర్ సెల్వం హఠాత్తుగా ప్రధానితో భేటీ కానుండడం తమిళనాడులో సంచలనంగా మారింది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకే ప్రధానితో పన్నీర్ సెల్వం భేటీ అవుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

మరోవైపు మాజీ మంత్రులు వేంకటాచలం, పళనియప్పన్‌, సెంథిల్‌ బాలాజీ ఆధ్వర్యంలోని 13 మంది ఎమ్మెల్యేలు బుధవారం చెన్నైలో రహస్య సమావేశం నిర్వహించారు. అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలని ఈ సందర్భంగా తీర్మానించినట్టు సమాచారం. తమ డిమాండ్లకు సంబంధించిన చిట్టాను పళని వర్గానికి అందజేసినట్టు తెలిసింది. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పందనను బట్టే తర్వాతి కార్యాచరణ గురించి ఆలోచించాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో వీరిని బుజ్జగించేందుకు పళని వర్గం రంగంలోకి దిగినట్టు తెలిసింది. మరోవైపు ఈ 13 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ వర్గంతో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News