: 'వాన్నా క్రై'కి విరుగుడు మాత్ర సిద్ధం... హైదరాబాదు సంస్థ ఘనత!
హైదరాబాదుకు చెందిన యూనిక్ సిస్టమ్స్ సంస్థ ప్రపంచానికి మేలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలపై ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ చేసిన 'వాన్నా క్రై' ర్యాన్ సమ్ వేర్ వైరస్ కు విరుగుడు మందును కనిపెట్టింది. 'జీరోఎక్స్ టీ' అని పిలవబడే ఈ సొల్యూషన్స్ ను కాంప్లెక్స్ ఆల్గరిథం ఆధారంగా అభివృద్ధి చేసినట్టు యూనిక్ సిస్టమ్స్ కో–ఫౌండర్ అండ్ సీఈఓ చక్రధర్ కొమ్మెర ప్రకటించారు. గతంలో సోనీ సంస్థపై హ్యాకర్లు విరుచుకుపడ్డ సమయంలోనే ర్యాన్ సమ్ వేర్ కు విరుగుడు తయారీపై తాము దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో తాము తయారు చేసిన జీరోఎక్స్ టీ ప్రొడక్ట్ కేవలం 'వాన్నా క్రై' ర్యాన్ సమ్ వేర్ దాడిని మాత్రమే కాకుండా ఎలాంటి సైబర్ దాడులనైనా తట్టుకుంటుందని ఆయన చెప్పారు. ర్యాన్ సమ్ వేర్ దాడులు మాత్రమే కాకుండా, అనధికార యాక్సెస్, డేటా లీకేజీ, డేటా సవరణ, విధ్వంసం వంటి క్లిష్టమైన సాఫ్ట్ వేర్ దాడులను సులభంగా పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇది సేవలందిస్తోందని, దీనిని త్వరలోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా మార్కెట్ లోకి తెస్తామని ఆయన ప్రకటించారు.