: ఈ భాగ్యం కలుగుతుందని ఊహించలేదు: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో తిరుమల శ్రీవారికి సేవలందించే భాగ్యం, అదృష్టం తనకు కలుగుతాయని ఊహించలేదని టీటీడీ కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణ కేడర్ కు వెళ్లానని, ఆ తర్వాత అడిగి మరీ ఆంధ్రా కేడర్ కు వచ్చానని చెప్పారు. పరిపాలనతో కూడిన విధులకు, ఆధ్యాత్మిక భావన నిండిన తిరుమల ఈవో విధులకు పెద్ద తేడా ఏమీ ఉండదన్నారు.
1994లో తాను తొలిసారి స్వామివారిని దర్శించుకున్నానని, తాను మొదటి నుంచి శ్రీవారి సేవకుడినేనని అన్నారు. టీటీడీ ఈవో గా బాధ్యతలు చేపట్టేందుకు తాను కాలినడకన కొండపైకి చేరుకుని, సాధారణ క్యూ లైన్ లో నిలబడి స్వామి వారి దర్శనం చేసుకోవడం ద్వారా భక్తుల ఇబ్బందులను తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులకు వెంటనే శ్రీవారి దర్శనం జరిగేలా కౌంటర్ల పనివేళల్లో మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నామని, ఈ విషయమై సాఫ్ట్ వేర్ లో మార్పులకు సిఫారసు చేశామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రాశస్త్యం, నిర్మాణ దశలో ఆగిపోయిన భవనాలు, భక్తులకు వసతులు, ప్రసాదాల పంపిణీ, యాత్రికులకు కల్పించే మెరుగైన సదుపాయాలు, రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో రోగులకు లభించే వైద్య సేవలు మొదలైన అంశాలపై ఆయన చర్చించారు.