: ఫాక్స్ న్యూస్ వ్యవస్థాపకుడు రోజర్ ఎయిల్స్ మృతి
ఫాక్స్ న్యూస్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ రోజర్ ఎయిల్స్ (77) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య ఎలిజబెత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది గుండె పగిలిపోయేంత విషాదమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయాలు, ఎంటర్ టెయిన్ మెంట్, న్యూస్ విభాగాల్లో ఆయన ప్రతిభ అమోఘమని ఆమె కొనియాడారు. రోజర్ మృతితో తాము విషాదంలో మునిగిపోయినా, ఆయన సాధించిన విజయాలను చూసి పొంగిపోతున్నామన్నారు.
కాగా, మీడియా రంగంలో పవర్ వాయిస్ వినిపించిన ‘ఫాక్స్ న్యూస్’ను 1996లో రూపర్ట్ మర్డోక్, రోజర్ ఎయిల్స్ కలసి స్థాపించారు. రోజర్ రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. ‘ఫాక్స్ న్యూస్’ను స్థాపించక ముందు అమెరికా మాజీ అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, జార్జి బుష్ సీనియర్ వంటి వారికి సలహాదారుడిగా ఆయన పని చేశారు. అయితే, ‘ఫాక్స్ న్యూస్’ లోని మహిళా ఉద్యోగులపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు తలెత్తడంతో.. రోజర్ గత ఏడాది తన పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం, నాడు యూఎస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ కు రోజర్ డిబేట్స్ తయారు చేసి ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ‘ఫాక్స్ న్యూస్’ను మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తన సొంతం చేసుకోవడం తెలిసిందే.