: నా శ్రమను దోచుకుంటోంది: హీరోయిన్ కంగనపై నిప్పులు చెరిగిన రచయిత
తానందించిన కథకు అతి చిన్న మార్పులు సూచించిన హీరోయిన్ కంగనా రనౌత్, ఇప్పుడు ఏకంగా టైటిల్స్ లో అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంటూ క్రెడిట్ తీసుకుందని రచయిత అపూర్వ అస్రానీ ఆరోపించారు. 'సిమ్రాన్' పేరిట హన్సల్ మెహతా దర్శకత్వంలో కంగన హీరోయిన్ గా ఓ చిత్రం నిర్మితమవగా, దీనికి అస్రానీ కథను అందించారు. తాను ఈ సినిమా కోసం 9 వర్షన్లు రాశానని, చివరి వర్షన్ చూసి ఎగిరి గంతేసి ఒప్పుకున్న కంగన, కొద్దిపాటి మార్పులను సూచించిందని, ఆమె కోరిక మేరకు మార్పులు చేస్తే, తానే స్క్రిప్ట్ ను రాసినట్టు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రచారం చేసుకుంటోందని నిప్పులు చెరిగాడు.
ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదల కాగా, టీజర్ చివర్లో టైటిల్ క్రెడిట్స్ లో అస్రానీ పేరు పైన కంగనా రనౌత్ అన్న పేరు కూడా కనిపించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇది తన శ్రమను దోచుకోవడమేనని అన్నాడు. దర్శకుడు మెహతాతో కలసి తానే స్క్రిప్టును రాశానని ఆమె ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించాడు. ఈ ఆరోపణలపై కంగనా రనౌత్ స్పందించాల్సి వుంది.