: ట్రంప్ ను అభిశంసన ద్వారా తప్పించాలంటే అనుసరించాల్సిన విధానం ఇది!
ఎఫ్బీఐ చీఫ్ పదవినుంచి జేమ్స్ కోమేను తొలగించిన అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అమెరికాలో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ట్రంప్ అభిశంసనపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిని తొలగించాలంటే అనుసరించే విధానం ఏంటంటే.... అధ్యక్ష స్థాయిలో ఉన్న వ్యక్తి తన విశేష అధికారాలను అడ్డం పెట్టి న్యాయవ్యవస్థకు అడ్డు తగలగడం లేదా న్యాయవ్యవస్థకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఖరారైన అనంతరం ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ బృందం రష్యాతో... ముఖ్యంగా అమెరికాలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లయాక్ తో సన్నిహిత సంబంధాలు నెరిపిందనే ఆరోపణలు ఇప్పటికీ మార్మోగుతునే ఉన్నాయి.
ఇదే సమయంలో పుతిన్ తో కలిసి పనిచేస్తానని ట్రంప్ వివిధ సందర్భాల్లో పేర్కొనడం... అందుకు తగ్గట్టే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్ తో సమావేశం సందర్భంగా పలు విషయాలను వెల్లడించానని, అలా చేయడానికి తనకు పూర్తి అధికారాలు ఉన్నాయని ఆయనే స్వయంగా పేర్కొనడం... ఈ క్రమంలో ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న సమంయలో ఎఫ్బీఐ చీఫ్ ను తొలగించడం, ఈ సందర్భంగా ఫ్లిన్ పై విచారణను నిలిపేయాలని కోరడం న్యాయ ప్రక్రియను అడ్డుకోవడం కిందకే వస్తుందని, ఈ కారణంతో ట్రంప్ ను అభిశంసించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధ్యక్షుడు పరిధిని దాటి న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలినా, ‘తీవ్ర నేరాలు, ఇతర స్వల్పకాలిక శిక్షార్హమైన నేరాలు’ చేసినా అధ్యక్షుడిని అభిశంసించవచ్చని అమెరికా రాజ్యాంగం చెబుతోంది.
పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ప్రమాణ స్వీకారాన్ని అతిక్రమించినా అమెరికా అధ్యక్షుడిని అభిశంసించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా, ‘అమెరికా అధ్యక్ష బాధ్యతలను పూర్తి నిష్టతో నిర్వర్తిస్తానని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను’ అన్నారు. ఈ లెక్కన మిత్రదేశాలు ఇచ్చిన రహస్య సమాచారాన్ని ఇతర దేశాలతో అధ్యక్షుడు పంచుకోకూడదు.
అలా పంచుకోవడం వల్ల మిత్ర దేశాలు అమెరికాతో భవిష్యత్ లో సమాచారం పంచుకునేందుకు ముందుకు రావు. ఇది జాతి ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో సాక్షాత్తూ ట్రంప్... రష్యా రాయబారితో కీలక సమాచారం పంచుకున్నానని ప్రకటించారు. ఇది ఆయన చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన సమాచారం ఎవరితోనైనా పంచుకోవచ్చు. ఆ అధికారం ఆయనకు ఉంటుంది. అయితే ఆయన అధ్యక్ష బాధ్యతలను పూర్తి నిష్టతో నిర్వర్తిస్తానని చేసిన ప్రమాణానికి మాత్రం వ్యతిరేకమని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో అభిశంసన ప్రక్రియను మొదలుపెట్టే అధికారం ప్రతినిధుల సభకు మాత్రమే ఉంది. అయితే... న్యాయశాఖ లేదా స్వయంగా ప్రతినిధుల సభ లేదా ప్రత్యేకంగా నియమించిన న్యాయవాది స్వతంత్ర విచారణ జరపడం నుంచి ఇది మొదలవుతుంది. ఈ విచారణ పూర్తయిన అనంతరం నివేదికను సాక్ష్యాధారాలతో సహా హౌస్ జ్యుడీషియరీ కమిటీ ముందు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఆధారాలను హౌస్ జ్యుడీషియరీ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం... అభిశంసన తీర్మానానికి ఆర్టికల్స్ ను రాస్తుంది. ప్రతినిధుల సభలో దీనిపై స్పష్టమైన చర్చ జరిగిన తరువాత ఓటింగ్ చేపడతారు.
ఈ ఓటింగ్ లో సాధారణ మెజారిటీతో అభిశంసన తీర్మానం నెగ్గితే ఆ తర్వాత అది సెనేట్ కు వస్తుంది. అక్కడ విచారణ మొదలవుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ విచారణ నిర్వహిస్తారు. ఈ సందర్భంలో అధ్యక్షుడు తన వాదనలు వినిపించుకోవచ్చు. హౌజ్ జ్యుడీషియరీ కమిటీ ప్రాసిక్యూషన్ గా వ్యవహరిస్తుంది. సెనేట్ లో మూడింట రెండొంతుల మంది సభ్యులు అంటే మొత్తం వంద మంది సెనేట్ సభ్యుల్లో 67 మంది అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు ఆయన పదవిని కోల్పోవాల్సి ఉంటుంది.