: ఏపీ చరిత్రలో ఈ పెన్ను, ఫైలుకు సుస్థిర స్థానం.. వీటి కథ ఏంటో తెలుసుకోండి!


ఒక పెన్ను, ఫైలుకు ఏపీ చరిత్రలో సుస్థిర స్థానం లభించింది. ఈ రెండింటినీ జాగ్రత్తగా ఉంచి, మ్యూజియంలో భద్రపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ పెన్ను, ఫైలు కథేంటో తెలుసుకుందాం.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ అత్యున్నత నగరాల్లో ఒకటిగా నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి డిజైనింగ్, నిర్మాణాల కోసం ఆయన ఎందరితోనో భేటీ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు నగరాలను పరిశీలించారు. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న సింపూర్ కన్సార్టయమ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సీడ్ క్యాపిటల్ గా పేరుగాంచిన ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం, మండం గ్రామాలకు చెందిన 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను సింపూర్ కన్సార్టియం నిర్మించనుంది. ఈ మేరకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు.

ఈ ఒప్పందాలకు సంబంధించి సంతకాలు చేసిన తర్వాత... తాను సంతకం చేసిన పెన్నును, ఫైలును సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కు చంద్రబాబు ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఈ రెండింటికీ గొప్ప స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు తెలిపారు. వీటిని చాలా జాగ్రత్తగా దాచి పెట్టాలని, రానున్న రోజుల్లో వీటిని మ్యూజియంలో భద్రపరచాలని సూచించారు. ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో చంద్రబాబుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రతిమను కానుకగా ఇచ్చారు. ఈ ప్రతిమను కూడా జాగ్రత్త చేయాలని అజయ్ జైన్ కు చంద్రబాబు చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే వాటిని జాగ్రత్తగా కాపాడితే... మనం కూడా చరిత్రలో నిలిచిపోతామని జైన్ కు ముఖ్యమంత్రి చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత కూడా పెన్ను, ఫైలు గురించి జైన్ కు చంద్రబాబు మరోసారి గుర్తు చేసి, జాగ్రత్తలు చెప్పారు. దీనికి సమాధానంగా, "మీ ఆదేశాలను తు.చ తప్పకుండాం పాటిస్తాం సార్" అంటూ అజయ్ జైన్ నవ్వుతూ అన్నారు. 

  • Loading...

More Telugu News