: ట్రంప్ పాలన బాగోలేదని 54% మంది అంటే... ట్రంప్ ను దించాలని 48% మంది అన్నారు: సర్వే ఫలితం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వ్యవహార శైలితో తలనొప్పులు కొనితెచ్చుకున్నారు. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే...తనకు అనుకూలంగా వార్తలు రాయని మీడియా సంస్థల వైట్ హౌస్ ప్రవేశాన్ని నిషేధించారు. పలు సందర్భాల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇది బెడిసి కొట్టింది. క్షేత్ర స్థాయి అధ్యయనాలు జరపకుండానే విదేశీయులపై బ్యాన్ తోపాటు, సరైన గుర్తింపు లేని వారిని దేశం నుంచి వెళ్లగొట్టారు. జ్యుడిషియల్ తో పాటు వివిధ శాఖల ఉద్యోగులను తొలగించి, తనకు నచ్చినవారిని, లేదా తన చెప్పుచేతల్లో ఉన్నవారని మాత్రమే కీలక విధుల్లో నియమించుకున్నారు. ఇది ఆయనపై వ్యతిరేకత తెచ్చింది. కొంత మందిలో తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది.
అలాగే ఒబామా కేర్ ను ఎత్తేయడం ప్రజల్లో ఆయనకు వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఇలా ఆయన చేపట్టిన రకరకాల చర్యలు అమెరికన్లకు ఆగ్రహం తెప్పించాయి. తాజాగా మీడియాలో ఆయనపై వెలువడ్డ కథనాలు ఆ ఆగ్రహాన్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పై 'పబ్లిక్ పాలసీ పోలింగ్ (పీపీపీ)' అనే ప్రైవేటు సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 54 శాతం మంది ట్రంప్ పాలన తీరు బాగాలేదని అభిప్రాయపడగా, కేవలం 40 శాతం మంది మాత్రమే బాగానే ఉందని సమాధానమిచ్చారు. మిగిలిన 6 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ట్రంప్ ను అభిశంసించాలని 48 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడగా, 41 శాతం మంది ట్రంప్ ను అభిశంసించాల్సిన అవసరం లేదని అన్నారు.