: రోగులు ఉండాల్సిన అంబులెన్స్‌లో 40 కార్టన్ల మద్యం సీసాలు!
రోగులు ఉండాల్సిన అంబులెన్స్‌లో 40 కార్టన్ల మద్యం సీసాలు కనిపించిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు మద్యం సీసాలను తరలించేందుకు అంబులెన్స్‌ను ఇలా ఉపయోగించుకున్నారు. ఇతర వాహనాల్లో తరలిస్తే పోలీసుల తనిఖీల్లో దొరికిపోతామని, అంబులెన్స్‌లో తరలిస్తే అందరూ వాహనానికి దారి ఇచ్చి మరీ పంపిస్తారని ఆలోచించి ఈ పనిచేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తులు పోలీసులకు చిక్కిపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే... అక్కడి ఖేదా గ్రామం సమీపంలో ఓ అంబులెన్స్ అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు సోదాలు చేశారు.
అంబులెన్స్ డోర్ తెరవగానే రోగి కనిపిస్తాడనుకుంటే వారికి మద్యం బాటిళ్లు కనిపించాయి. మొత్తం 40 కార్టన్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మనోజ్, మురళీ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీటిని హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు కొన్ని నెలలుగా ఇలాగే అక్రమరవాణాకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది.