: యూపీ అసెంబ్లీలో నిద్రపోయిన ఎమ్మెల్యేలు.. లైవ్ ప్రసారం
ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత నిన్న తొలిసారి ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న ప్రతిపక్ష పార్టీలు సభలో ప్రసంగిస్తున్న గవర్నర్ రామ్ నాయక్‌పై కాగితపు బంతులు విసిరి దేశ వ్యాప్తంగా వార్తల్లోకెక్కారు. ఈ రోజు కూడా ఆ అసెంబ్లీలో విచిత్ర పరిస్థితి కనపడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురానున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో ఓ మంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు గాఢంగా నిద్రపోయికనిపించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలని తొలిసారి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలతో కలసి ధాటిగా ఎలా పనిచేస్తున్నానో అందరూ చూడాలని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇవ్వడంతో అసెంబ్లీ సమావేశాల లైవ్ ప్రసారం చేస్తున్నారు.
ఎంతో ఆసక్తిగా అసెంబ్లీ సమావేశాలను చూస్తోన్న ఆ రాష్ట్ర ప్రజలకు ఈ నిద్ర సీన్లు కనపడడంతో యోగికి షాక్ తగిలింది. తమ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉండడం, జీఎస్టీపై కీలక చర్చజరుగుతున్న సమయంలో తమ రాష్ట్ర అసెంబ్లీలోనే ఇటువంటి ఘటన జరుగుతుండడంతో యోగి ఆదిత్యనాథ్ విమర్శలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. జీఎస్టీ బిల్లు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ బిల్లులో పలు సవరణలు చేసిన తరువాత ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాయి.