: పీవీ సింధుపై చూపిన ప్రేమను రైతులపై చూపలేరా?: జగన్ నిప్పులు
క్రీడాకారిణి పీవీ సింధుపై అభిమానం చూపడంలో తప్పులేదని, ఆమెపై చూపుతున్న ప్రేమలో కొంత భాగాన్నైనా రైతులపై చూపిస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. గిట్టుబాటు ధరలు లభించక, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, సమస్యను పట్టించుకోవట్లేదని చంద్రబాబు సర్కారు వైఖరిపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్, నేటి నుంచి మిర్చి యార్డుకు సెలవు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు.
ఈ ఉదయం అసెంబ్లీ వాయిదా పడ్డ తరువాత జగన్ మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఇప్పటివరకు మిర్చి కొనుగోలుకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చారని, చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే యార్డుకు సెలవు ఇచ్చారని నిప్పులు చెరిగారు. కేంద్రం రూ. 5 వేలను క్వింటాలుకు ఇస్తానన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ధరల స్థిరీకరణ నిధి విషయం ఏమైందని ప్రశ్నించారు. తమ పార్టీ జీఎస్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ, రైతుల సమస్యలపై చర్చిద్దామంటే, ప్రభుత్వం తప్పించుకుందని ఆరోపించారు. 'అ' అంటే అమరావతి, అభివృద్ధి కాదని, అవినీతి, అరాచకాలు, అనారోగ్యం, అబద్ధాలు అని చంద్రబాబు నిరూపిస్తున్నారని దుయ్యబట్టారు.