: మండుటెండలోనూ బీరుకు తగ్గిన డిమాండ్.. లిక్కర్‌నే గొంతులో పోసుకుంటున్న మందుబాబులు!


సాధారణంగా వేసవిలో బీర్ల అమ్మకాలు జోరందుకుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా మందుబాబులు లిక్కర్‌కే జై కొడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ మేలో తగ్గిన బీర్ల అమ్మకాలే అందుకు సాక్ష్యం. లిక్కర్ అమ్మకాలు మాత్రం పదిశాతం వృద్ధి నమోదు చేశాయి. మార్చి వరకు బీర్ల అమ్మకాలు ఓ రేంజ్‌లో ఉండగా వేసవి వేడి పెరిగిన కొద్దీ లిక్కర్ అమ్మకాలు ఊపందుకుని బీర్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి.

గతేడాది మే 12 వరకు 9.14 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 8.78 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే 3.90 శాతం అమ్మకాలు పడిపోయాయి. గతేడాది మేలో 9.95 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 11.03 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడుపోయి 10.84 శాతం వృద్ధి నమోదైంది. కాగా, బీర్లకు డిమాండ్ ఎంత తగ్గితే అంత మంచిదని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకు 25 లక్షల కేసుల బీర్లకు డిమాండ్ ఉండగా, ఉత్పత్తి మాత్రం 10 లక్షల కేసులే కాబట్టి ఇదీ ఒకందుకు మంచిదేనని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News