: గురుదాస్ పూర్ లో ముష్కర చొరబాటు... కాల్చిచంపిన జవాన్లు!
పంజాబ్ లోని గురుదాస్ పూర్ ప్రాంతంలో సరిహద్దులు దాటి వచ్చిన పాక్ ముష్కరుడిని సరిహద్దు భద్రతా దళాలు కాల్చి చంపాయి. విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లకు ఈ ఉదయం కంచె వద్ద అనుమానాస్పద కదలికలు కనిపించాయని, దీంతో వారు హెచ్చరించినా వినకుండా చొరబాటుదారు భారత్ వైపు వస్తుండటంతో, మరో ఆలోచన లేకుండా అతడిని కాల్చి చంపారని ఓ అధికారి వెల్లడించారు. ఇతను ఎవరన్న విషయం తెలియాల్సి వుందని, ఆ ప్రాంతంలో జవాన్లు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని తెలిపారు.
కాగా, పాక్ సైన్యం సరిహద్దుల్లోని భారత గ్రామాలు లక్ష్యంగా మోర్టార్లతో విరుచుకుపడగా, ఇద్దరు సాధారణ పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీ నుంచి పాక్ కాల్పులు నిరాటంకంగా సాగుతుండగా, దాదాపు 10 వేల కుటుంబాలను ఇప్పటివరకూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ 50 చొరబాటు యత్నాలను తిప్పికొట్టామని సైనిక వర్గాలు వెల్లడించాయి.