: అందరూ నా పేరును వాడుకునే వారే!: రజనీకాంత్
తమిళనాడు రాజకీయాల్లో తానెప్పుడూ పాలుపంచుకోలేదని, ఎన్నడూ ఏ పార్టీకీ మద్దతివ్వలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు సమయానుసారం తన పేరును వాడుకున్నాయని ఆరోపించారు. ఇకపై అలా జరగనివ్వబోనని చెప్పారు. కొన్ని పార్టీలు తన పేరును వాడుకుంటుంటే అభిమానుల్లో సైతం పలుమార్లు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో సందిగ్ధత ఏర్పడిందని తెలిపారు. అభిమానులు మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రజనీ సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా, దాన్ని తీర్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు డబ్బు అక్కర్లేదని, మీలో ఉన్న నిబద్ధత, అంకితభావమే చాలని రజనీ చెప్పినప్పుడు అభిమానుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. నేటి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మూడు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులతో గడపనున్న రజనీ, వచ్చిన వారందరితోనూ ఫోటోలు దిగనున్నారు.