: జగన్ ప్రధానిని కలిసింది ప్రజా సమస్యల గురించి కాదు.. తన సమస్యల గురించట!... వెలుగులోకి వచ్చిన వినతిపత్రం!


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రధానిని కలవడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై టీడీపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో రోజూ ఇదే చర్చ నడుస్తోంది. అయితే తాజాగా సంచలనం కలిగించే విషయం ఒకటి బయటపడింది. ప్రజా సమస్యల గురించి విన్నవించేందుకే ప్రధానిని కలిశానని జగన్ చెప్పుకొచ్చారు.  

ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం కోసమే ప్రధానిని కలిశానని, ఒకటి రెండు అంశాల్లో తప్ప బీజేపీకి, తమ పార్టీకి మధ్య విభేదాలు ఏమీ లేవని విలేకరుల సమావేశంలో చెప్పారు. మిర్చి రైతులకు మద్దతు ధర పెంచాలని, ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించమని, అగ్రిగోల్డ్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చూడాలని.. ఇలా బోల్డన్ని సమస్యలను ప్రధానికి నివేదించినట్టు చెప్పారు. కానీ లోపల జరిగింది అదికాదని ఓ పత్రిక పేర్కొంది. జగన్ ప్రధానికి ఇచ్చినట్టు చెబుతున్న వినతిపత్రం సంపాదించిన పత్రిక అందులోని అంశాలతో కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..

ప్రధానిని కలిసిన జగన్ ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి కాకుండా తన సమస్యల పరిష్కారం కోసమే కలిశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను వేధిస్తోందని ప్రధానికి ఫిర్యాదు చేస్తూ ఏడు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. టీడీపీ మాయలో పడిన ఈడీ అధికారులు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయారు. తనను కాపాడాలని కోరారు. ఈ మేరకు జగన్ హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జోన్‌లో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్‌గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్ బీఎస్ గాంధీల పేర్లను ప్రధాని వద్ద ప్రస్తావించారు. వారిద్దరూ టీడీపీతో కుమ్మక్కై తనను ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు చేశారు. పనిలోపనిగా ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఈ మూడేళ్లలో చంద్రబాబు రూ.1.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం బయటపడిన జగన్ వినతిపత్రం ఏపీలో దుమారం రేపుతోంది. జగన్‌పై ఎదురుదాడికి ఇది టీడీపీకి పాశుపతాస్త్రంలా ఉపయోగపడింది.

  • Loading...

More Telugu News