: అప్పుడు, నా కోసం మా అమ్మ వీఆర్ఎస్ తీసుకుంది: నటి రోజా
తాను ఆర్టిస్టు అవ్వాలన్నది తన తండ్రి కోరిక అని ప్రముఖ నటి రోజా అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను సినిమాల్లోకి రావడం మా అమ్మకు, అన్నయ్యలకు ఇష్టం లేదు. మా నాన్న సారథి స్టూడియోస్ లో సౌండ్ ఇంజనీర్ గా చేసేవారు. ‘ఆర్టిస్ట్ గా నాకు రాని అవకాశం నీకు వచ్చింది. నటిస్తే బాగుంటుంది’ అని మా నాన్న అన్నారు. మా అమ్మ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా చేసేవారు. నాకు తోడుగా ఉండాలని చెప్పి, తాను చేస్తున్న ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టింది. అలాగే మా అన్నయ్యలు కూడా వాళ్ల చదువులు వదిలి పెట్టి నాకు తోడుగా చెన్నైకు వచ్చారు.
ఎందుకంటే, మా మూడు జనరేషన్స్ లో నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. మిగిలిన ఆర్టిస్టుల తల్లుల కంటే మా అమ్మ చాలా అమాయకురాలు. మా అన్నయ్యలు ఏం చెబితే అది. మా అమ్మ నాతో పాటు షూటింగ్ కు రావడం, నాకు భోజనం పెట్టడం, మళ్లీ షూటింగ్ నుంచి నాతో పాటు రూమ్ కు రావడం తప్పా, ఆమెకేమీ తెలియదు. సిస్టమేటిక్ గా ఈ రోజున నేను ఉన్నానంటే, దానికి కారణం మా అమ్మే. ఆమె నుంచే నేను నేర్చుకున్నాను’ అని రోజా చెప్పుకొచ్చారు.