: భక్త జనసంద్రంతో కిటకిటలాడుతున్న తిరుమల
వేసవి సెలవులకు తోడు వారాంతం కలసిరావడంతో తిరుమల గిరులు శ్రీవారి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో సర్వదర్శనం భక్తులు నిండిపోగా క్యూలైన్ వెలుపలకు వచ్చింది. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
అద్దె గదుల కోసం భక్తులు గంటల తరబడి సీఆర్వో కార్యాలయం వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తలనీలాల సమర్పణకు మూడు గంటల వరకూ సమయం పడుతోంది. గదులు దొరకని భక్తులతో తిరుమలలోని ఫుట్ పాత్ లు, షెడ్లు నిండిపోయాయి. భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాన్ని అన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని, వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని టీటీడీ అధికారులు వెల్లడించారు.