: నేడు పుణె, పంజాబ్ లకు చావోరేవో... ఎవరు గెలిస్తే వాళ్లకే ప్లే ఆఫ్ చాన్స్
ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు ప్లే ఆఫ్ అవకాశాన్ని ఖరారు చేసుకోగా, నాలుగో స్థానం కోసం నేడు రైజింగ్ పుణె సూపర్ జయింట్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం జరగనుండగా, గెలిచే జట్టుకు మాత్రమే చాన్స్ ఉంటుంది. పుణె జట్టు 16 పాయింట్లతో మైనస్ 0.083 రన్ రేటుతో ఉండగా, పంజాబ్ జట్టు 14 పాయింట్లతో, పుణెకన్నా మెరుగైన స్థితిలో 0.296 నెట్ రన్ రేటుతో ఉంది.
ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే, 16 పాయింట్లు తెచ్చుకుని పుణెకన్నా రన్ రేటు ఎక్కువగా ఉన్న కారణంగా ప్లే ఆఫ్ కు చేరుతుంది. పుణె గెలిస్తే, 18 పాయింట్లతో టాప్-2కు వెళుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయి చెరో పాయింట్ వచ్చిన పక్షంలో 17 పాయింట్లతో పుణె జట్టు మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్-1 మ్యాచ్ ఆడుతుంది. ఇక నేడు జరిగే రెండో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనుండగా, ఇరు జట్లూ ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకోవడంలో విఫలమైనందున ఈ మ్యాచ్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు.