: నేటితో ముగిసిన జనసేన సైనికుల దరఖాస్తుల స్వీకరణ గడువు.. మరో ప్రకటన చేసిన పవన్ కల్యాణ్
గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన సైనికులను ఎంపిక చేయడానికి జనసేన పార్టీ ఈ నెల ఆరు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజుతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. దీంతో పవన్ కల్యాణ్ ఈ రోజు మరో ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర, గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ నెల 17వ తేదీ నుంచి జనసేన గుర్తింపు శిబిరాలు ప్రారంభం కానున్నాయని అన్నారు. స్పీకర్స్, అనలిస్ట్స్, కంటెంట్ రైటర్స్‌గా సేవలు అందించడానికి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం 6 వేల దరఖాస్తులు వచ్చాయని, గ్రేటర్ హైదరాబాద్ నుంచి 4,500 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
జనసేన ప్రకటించిన వివరాల ప్రకారం ఈ నెల వివిధ ప్రాంతాల్లో శిబిరాలు జరగనున్న తేదీలు, ప్రాంతాలు..
17, 18 తేదీల్లో శ్రీకాకుళంలో, బాపూజీ కళామందిర్లో
19, 20 తేదీల్లో విశాఖలోని శ్రీకృష్ణ విద్యా మందిర్‌లో
23, 24, 25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ శివారులోని కొంపల్లిలోని ఏఎంఆర్ గార్డెన్స్‌లో
శిబిరం, సమయం మిగతా వివరాలను దరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియజేస్తారు. జనసేన అధికారిక ఫేస్‌బుక్‌లోనూ చూసుకోవచ్చు.