: గేదె చర్మం ఒలుస్తున్నారంటూ ఐదుగురిపై పిడిగుద్దులు కురిపించిన స్థానికులు
ఓ ఇంట్లో గేదె చర్మం ఒలిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పలువురిపై స్థానికులు దాడిచేసి కలకలం రేపిన ఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్‌లో చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఐదుగురిపై దాడి జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, స్థానికులు మాత్రం ఆగకుండా ఆ ఐదుగురిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ వ్యక్తులు గేదెను వధించి అనంతరం చర్మం తీస్తున్నారని స్థానికులు అన్నారు.
కాళీ బఘేల్ అనే వ్యాపారి ఇంట్లో గేదెను వధించి చర్మం తీయడానికి ప్రయత్నించారని స్థానికులు చెప్పడంతో ఆ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డెయిరీ సంస్థలో ఉండే ఆ గేదె వ్యాధితో బాధపడుతూ చనిపోయిందని ఆ ఐదుగురు నిందితులు పోలీసులకు తెలిపారు. డెయిరీకి వస్తోన్న నష్టాలను పూడ్చుకునేందుకు చర్మాన్ని తీస్తున్నట్లు వారు పేర్కొన్నారని పోలీసులు అన్నారు.