: అనుచితం, అవాంఛనీయం: ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేసి, మరొకరిని పెళ్లి చేసుకునే విధానంపై ఎంతో మంది ముస్లిం మహిళలు కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు రెండో రోజు విచారణ ప్రారంభించి, ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విధానం అనుచితమని, అవాంఛనీయమని పేర్కొంది. అయితే, ఈ విధానాన్ని ఇస్లాం మాత్రం చట్టబద్ధమనే చెబుతుందని తెలిపింది.
ఈ కేసులో తన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రామ్ జఠ్మలాని... ఈ విధానం పురుషులకు మాత్రమే అనుకూలంగా ఉందని, తలాక్ చెప్పి భర్తను వదిలించుకునేందుకు మాత్రం మహిళలకు హక్కులు లేవని అన్నారు. తలాక్‌పై సుప్రీంకోర్టులో మొత్తం ఆరు రోజుల పాటు విచారణ కొనసాగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం చేపడుతున్న ఈ విచారణలో తలాక్ అనేది మతపరమైన ముఖ్య ఆచారమా? అన్న విషయంతో పాటు ఈ అంశం ప్రాథమిక హక్కా? అనే అంశంపై వాదనలు విని ఓ నిర్ణయం తీసుకోనుంది.