: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ మరో నిర్వాకం.. వాగ్వాదాన్ని వీడియో తీశాడని భారతీయుడి టికెట్ రద్దుచేసిన సంస్థ
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ మరో నిర్వాకం బయటపడింది. లగేజీ ఎందుకు ఎక్కువ మొత్తం చెల్లించాలని ప్రశ్నించినందుకు భారతీయ సంతతికి చెందిన ప్రయాణికుడి టికెట్‌ను రద్దు చేసింది. బాధితుడు నవాంగ్ ఓజా(37) కథనం ప్రకారం.. వెస్ట్‌కోస్ట్ టూరు ముగించుకున్న ఓజా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి న్యూ ఓర్లాన్ వెళ్లేందుకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. టూర్‌కు వెళ్లేముందు ఆయన లగేజీకి ఎయిర్‌లైన్స్ సిబ్బంది 300 డాలర్లు చార్జి చేశారు. అయితే విమానాశ్రాయానికి చేరుకున్న అతడి నుంచి సిబ్బంది మరో 125 డాలర్లు వసూలు చేశారు. దీంతో ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారని అక్కడి మహిళా సిబ్బందిని ఓజా ప్రశ్నించాడు. ఆమె అతడితో వాగ్వాదానికి దిగుతూ పెద్దగా అరించింది. ఆమె అరుస్తున్న సమయంలో ఓజా వీడియో తీశాడు. ఇది చూసిన ఆమె మరింతగా రెచ్చిపోయింది. పక్కనే ఉన్న ఏజెంట్‌ను పిలిచి టికెట్ రద్దు చేయించింది.
దీంతో ఈ వీడియోను ఓజా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక టికెట్ రద్దు చేయడంతో ఓజా మరో ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో స్పందించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాశ్రయ సిబ్బంది, ఓజాతో మాట్లాడుతున్నట్టు వివరణ ఇచ్చింది. కాగా, ఇటీవల యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తన ప్రవర్తనతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటూ ఇటీవల విమానంలోంచి ఓ వైద్యుడిని విమాన సిబ్బంది ఈడ్చుకెళ్లారు. దీంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగొచ్చిన సంస్థ అతడికి క్షమాపణలు తెలిపింది.