: పొత్తులపై తొందర ఎందుకు...ఇంకా చాలా సమయం ఉంది: పురందేశ్వరి
ఏపీలో బీజేపీ పొత్తుల కోసం ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలవడంలో ప్రత్యేకత ఉందని భావించడం లేదని అన్నారు. ప్రధానిని ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత కలవడంలో ఎలాంటి వివాదం ఉండదని ఆమె చెప్పారు. దీనిపై పొత్తులు, సమీకరణాలు మారాయని వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఇప్పుడే పొత్తుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని మాత్రం తాను చెప్పగలనని ఆమె అన్నారు. అయితే భవిష్యత్ లో మార్పులు చోటుచేసుకుంటాయా? లేదా? అన్న విషయం తాను ఇప్పుడే చెప్పలేనని ఆమె స్పష్టం చేశారు. తమకు ఎవరితో అయితే లాభసాటిగా ఉంటుందో వారితోనే పొత్తు పెట్టుకుంటామని ఆమె తెలిపారు. ప్రతిపార్టీ అలాగే ఆలోచిస్తుందని ఆమె వివరించారు.