: రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల నుంచి ఈ నలుగురేనా?
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ఏకగ్రీవ విధానమే సరైందని వివిధ పార్టీలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కే.అద్వానీని నిలబెడతారని వార్తలు రాగా, వాటిని ఆయన ఖండించారు. అనంతరం పలువురి పేర్లు వినిపించినప్పటికీ వారు కూడా ఆ వార్తలను ఖండించారు. దీంతో ప్రణబ్ ముఖర్జీని మరోసారి కొనసాగించనున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా రాష్ట్రపతి రేసులో ఎన్డీయేతర పార్టీల అభ్యర్థులుగా జాతీయ మీడియాలో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీలు ఉన్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న శరద్ పవార్ తో పాటు, దళిత నేత, కాంగ్రెస్ కు చెందిన మీరా కుమార్ కు అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. వారితో పాటు జేడీయూకు చెందిన శరద్ యాదవ్, మహాత్మాగాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీకి కూడా విపక్షాల నుంచి ఆదరణ లభిస్తోంది.