: తెలంగాణ భూసేకరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ భూసేకరణ చట్టం-2013కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి భవన్ కు పంపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఈ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే... ఈ బిల్లు చట్టంగా మారుతుంది. సత్వరమే భూసేకరణ చేసేందుకు 2013 కేంద్ర భూసేకరణ చట్టాన్ని అనుసరించి నూతన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం 2016 డిసెంబర్ లో తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ ఆరు సవరణలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో, భూసేకరణ చట్టం-2013 సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఏప్రిల్ 30న ఆమోదం తెలిపింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, ఈ బిల్లును ఆమోదించారు.