: గురువుకే పంగనామాలు... చాముండేశ్వర మహర్షిని మోసం చేసిన అరుణారెడ్డి!
ఓ స్వామీజీ వద్ద భక్తురాలిగా చేరి, ఆయన్ను నమ్మించి మోసం చేసిందో మాయ లేడి. హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి వద్ద అరుణారెడ్డి అనే మహిళ భక్తురాలిగా వచ్చి, శిష్యురాలిగా మారింది. స్వామీజీకి నమ్మకంగా మారి, ఆయనకు చెందిన ఇన్నోవా వాహనానికి మరమ్మతులు చేయిస్తానని చెప్పి తీసుకెళ్లి వేరేవాళ్లకు తాకట్టు పెట్టింది.
తర్వాత ఎన్నిసార్లు అడిగినా మాయమాటలు చెబుతున్న ఆమె వైఖరిపై అనుమానం వచ్చిన చాముండేశ్వర మహర్షి, ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణారెడ్డిపై ఇదే తరహా కేసులు మల్కాజ్ గిరి, నారాయణగూడలతో పాటు నల్గొండలోనూ నమోదై ఉన్నాయని గుర్తించారు. ఇటీవలే అరుణారెడ్డి మల్కాజ్ గిరిలో ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో అరెస్టయినట్టు తెలుసుకున్నారు. కోర్టులో పిటిషన్ వేసి అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.