: రూ.70 వేల అప్పున్న ట్యాక్సీ డ్రైవర్‌కు.. బంగారు ఆభరణాల బ్యాగ్ దొరికింది.. దానినేం చేశాడంటే?
ఇరవై రెండేళ్ల దేవేంద్ర కాప్రి ట్యాక్సీ డ్రైవర్. ఢిల్లీలో ట్యాక్సీ నడుపుతూ పొట్ట పోసుకుంటున్నాడు. ఇటీవల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ కశ్మీరీ ప్రయాణికుడిని ఎక్కించుకున్న దేవేంద్ర అతడిని పహర్‌గంజ్ వద్ద దింపాడు. అనంతరం రాత్రి ఇంటికి వెళ్లి చూసుకుంటే తన ట్యాక్సీలో ఎక్కిన ప్రయాణికుడి బ్యాగ్ అందులో కనిపించింది. మరిచిపోయి ఉంటాడని భావించి బ్యాగును తీసిన అతడికి కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విదేశీ కరెన్సీ కనిపించింది. వాటి విలువ రూ.8 లక్షలకు పైనే ఉంటుంది.
కాసేపు అతడికి ఏమీ అర్థం కాలేదు. అప్పటికే అతడికి రూ.70 వేల అప్పు ఉంది. ఇంకా బోల్డన్ని అవసరాలున్నాయి. ఆ బ్యాగును ఏం చేయాలి? ఆ డబ్బుతో హాయిగా బతికేయడమా? నిజాయతీగా ప్రయాణికుడికి అప్పగించడమా? అంతర్మథనం మొదలైంది. చివరికి అతడి మనసు నిజాయతీకే ఓటేసింది. అంతే.. వెంటనే డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగును టేబుల్‌పై పెట్టాడు. దానిని యజమానికి అందించాలని పోలీసులను కోరాడు. అతడి నిజాయతీకి పోలీసులు మెచ్చుకున్నారు. బ్యాగును పోగొట్టుకున్న ప్రయాణికుడికి అందించారు. తన చేతిలో రూ.8 లక్షల బ్యాగ్ ఉన్నా తన అవసరాలు గుర్తు రాలేదని, నిజాయతీ ఒక్కటే గుర్తొచ్చిందని దేవేంద్ర చెప్పుకొచ్చాడు. బ్యాగును పోలీసులకు అప్పగించే వరకు తనకు నిద్ర పట్టలేదని పేర్కొన్న దేవేంద్ర ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు.