: అమెరికాలో భారతీయ సిక్కు హత్య
అమెరికాలో వరుసగా జరుగుతున్న భారతీయుల హత్యలు పెనుకలకలం రేపుతున్నాయి. తాజాగా మరో భారతీయుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ లోని కపుర్తలాకు చెందిన జగ్ జీత్ సింగ్ (32) 18 నెలల క్రితం అమెరికా వచ్చారు. హట్చ్ ఫుడ్, గ్యాస్ కన్వీనియెన్స్ స్టోర్ లో క్లర్క్ గా పనిచేస్తున్నారు. ఆయనను ఒక వ్యక్తి వచ్చి సిగిరెట్లు కావాలని అడగడంతో, మైనర్ ఏమో అన్న అనుమానంతో జగ్ జీత్ సింగ్ ఐడీ చూపించాలని కోరాడు.
దీంతో, జగ్ జీత్ సింగ్ ను ఆ వ్యక్తి జాత్యహంకారంతో దూషిస్తూ, కత్తితో పొడిచేశాడు. దీనిని చూసిన ప్రత్యక్ష సాక్షులు, ఆయనను ఆసుపత్రికి తరలించారు. 9 గంటలపాటు చికిత్స పొందిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా, వారం వ్యవధిలోనే వరుసగా భారతీయులు హత్యకు గురికావడం పట్ల ఆందోళన నెలకొంటోంది.