: మీడియాలో కనిపించేందుకే పవన్ చౌకబారు విమర్శలు: వర్ల రామయ్య
మీడియాలో కనిపించాలన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను పవన్ కల్యాణ్ తప్పుబడుతూ ప్రకటనలు చేస్తున్నారని తెలుగుదేశం నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ఉత్తరం, దక్షిణం అంటూ ఇండియాను విడదీసే పనిని పవన్ పెట్టుకోవద్దని హితవు పలికారు. సింఘాల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉంటే తప్పేంటని ప్రశ్నించిన ఆయన, తెలుగువాడైన వీరయ్య చౌదరి కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారని గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని, మీడియా ప్రచారం కోసం చౌకబారు విమర్శలు చేయవద్దని పవన్ ను వర్ల రామయ్య కోరారు. 2019లో పాండవులైన తెలుగుదేశానికి, కౌరవులైన వైకాపాకు మధ్య ఎన్నికల కురుక్షేత్రం జరగనుందని, దీనిలో విజయం సాధించేది తెలుగుదేశం పార్టీయేనని జోస్యం చెప్పారు.