: పాక్ బంకర్లపై సైన్యం భీకర దాడి... భారత్ సెకండ్ సర్జికల్ స్ట్రయిక్స్!
సరిహద్దులు దాటి వచ్చి, ఇద్దరు భారత జవాన్ల తలలు నరికిన పాకిస్థాన్ కు భారత జవాన్లు గట్టి బుద్ధి చెప్పారు. సరిహద్దులకు ఆవల పాకిస్థాన్ బంకర్లే లక్ష్యంగా శక్తిమంతమైన బాంబులను ప్రయోగిస్తూ విరుచుకుపడ్డారు. కృష్ణఘాటి సెక్టార్ లో పాకిస్థాన్ దాడులకు పాల్పడగా, వాటిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం ఏకంగా రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. పాక్ బంకర్లను సమూలంగా నాశనం చేసేలా బాంబులేసింది.
ఆపై చెల్లాచెదురై బయటకు వస్తున్న పాక్ సైనికులపై తూటాల వర్షం కురిపించగా, ఏడుగురు మరణించినట్టు ప్రాథమిక సమాచారం. ఈ దాడిని భారత సైనికాధికారులు రెండో సర్జికల్ స్ట్రయిక్స్ గా అభివర్ణిస్తున్నారు. ఈ దాడి దృశ్యాలను వీడియో తీసిన సైన్యం, వాటిని మీడియాకు అందించింది. దూసుకెళుతున్న చిన్న రాకెట్లు, పగిలిపోయి కుప్పకూలుతున్న బంకర్లు, తుపాకుల శబ్దాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాగా, ఈ దాడి సరిగ్గా ఎప్పుడు జరిగిందన్న వివరాలు వెల్లడించకపోయినా, తలల నరికివేత ఘటన తరువాతే ఇది జరిగినట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు.