: అమెరికాలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయండి.. ఇర్వింగ్ మేయర్‌కు వైసీపీ ఈ-మెయిల్.. అమెరికాలో ఏపీ పరువు తీసిన ప్రతిపక్షం!


అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయాలంటూ వైసీపీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు ఇర్వింగ్ మేయర్ బేతవాన్ డ్యూన్‌కు ఈ-మెయిల్స్ పంపించారు. ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో చంద్రబాబు 25 మందిని చంపించారని, ఇప్పుడాయన ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అమెరికాలో పర్యటిస్తున్నారని అందులో ఆరోపించారు. అక్రమంగా భారీ ఎత్తున నిధులు సేకరిస్తున్న ఆయనను అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని కోరుతూ ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరిట ఈ-మెయిల్స్‌ వచ్చాయి.

ఈ-మెయిల్స్ చూసి అప్రమత్తమైన ఇర్వింగ్ మేయర్ ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించారు. ప్రవాసాంధ్రులతో చంద్రబాబు సమావేశమైన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడంతా కోలాహలంగా ఉంది. భారీ సంఖ్యలో హాజరైన ప్రవాసాంధ్రులు, ప్రముఖులతో సందడిగా ఉంది. దీంతో ఇది ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధుల సమావేశమని పోలీసులు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని, పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు.

తమకొచ్చిన ఈ-మెయిల్ సమాచారం దురుద్దేశపూర్వకంగా ఉందని అనుమానించిన పోలీసులు చంద్రబాబుకు భద్రత కల్పించడం విశేషం. నిజానికి విదేశాల నుంచి వచ్చిన నాయకులకు అక్కడి పోలీసులు ఎటువంటి భద్రత ఏర్పాటు చేయరు. కార్యక్రమ నిర్వాహకులు కూడా భద్రతను కోరలేదు. దీంతో భద్రతగా ఉన్న పోలీసులను చూసిన నిర్వాహకులు భద్రత ఎవరు కల్పించమన్నారని పోలీసులను ప్రశ్నించగా, ఈ-మెయిల్ వ్యవహారం వెలుగుచూసింది. తప్పుడు ఈ-మెయిల్స్ పంపిన వ్యక్తుల నుంచి భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న అనుమానంతో తమకు తాముగానే భద్రత కల్పించినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం నిర్వాహకుల వంతైంది. ఈ-మెయిల్ పంపిన వారి వ్యవహారం వారికే ఎదురుతన్ని చంద్రబాబుకు భద్రత కల్పించేందుకు కారణమైంది.

  • Loading...

More Telugu News