: 1000 కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో... ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు ప్రభాస్ లేఖ
అధికారికంగా 'బాహుబలి-2' రూ. 1000 కోట్ల మార్క్ ను దాటేసిన నేపథ్యంలో హీరో ప్రభాస్, తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ రాశాడు. "నా ఫ్యాన్స్ అందరికీ..." అంటూ ప్రారంభించిన ఈ లేఖలో తనపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇండియాలో మాత్రమే కాకుండా, విదేశాల్లో సైతం ప్రేక్షకుల ఆదరణ పొందడానికి తన వంతు ప్రయత్నం చేశానని, సినీ ప్రేక్షకులు చూపిన ఆదరణను చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నానని అన్నాడు. బాహుబలి చిత్రం ఓ సుదీర్ఘ ప్రయాణమే అయినా ఈ సినిమా నుంచి తాను ఆశించినంత అభిమానం దక్కిందని చెప్పాడు. తనపై నమ్మకముంచి, జీవితంలో అతిపెద్ద అవకాశాన్ని ఇచ్చి, తన ప్రయాణాన్ని సుదీర్ఘ కాలం గుర్తుండిపోయేలా చేసిన దర్శకుడు రాజమౌళికి కూడా ప్రభాస్ ధన్యవాదాలు చెప్పాడు.