: సీన్ రివర్స్.. తలాక్ చెప్పిన భార్య.. చెల్లదన్న మతపెద్ద!
సీన్ రివర్స్ అయింది. తలాక్ పేరుతో భార్యలను భయపెట్టే భర్తలను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ఓ భార్య తన భర్తకు మూడుసార్లు తలాక్ చెప్పి షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. తన భర్తకు తలాక్ చెప్పాలని ఉందంటూ గతంలో పోలీసులను ఆశ్రయించిన మీరట్‌కు చెందిన అమ్రీన్ బానో(24) అన్నంత పనీ చేసింది. 2012లో అమ్రీన్, ఆమె సోదరి ఫర్హీన్‌లు సబీర్, షకీర్ అనే అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరులో షకీత్ తన భార్య ఫర్హీన్‌కు తలాక్ చెప్పాడు. అనంతరం అన్నదమ్ములు ఇద్దరూ కలిసి భార్యలను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
ఈ ఏడాది జనవరిలో అమ్రీన్, ఫర్హీన్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఆ సందర్భంగా భర్తకు తలాక్ చెప్పాలని ఉందంటూ అమ్రీన్ వ్యాఖ్యానించింది. కాగా తాజాగా అమ్రీన్ ఐజీ కార్యాలయంలో మీడియా సమక్షంలో భర్తకు మూడుసార్లు తలాక్ చెప్పి సంచలనం సృష్టించింది. కట్నం కోసం తమను హింసించారని, ప్రశ్నించినందుకు తన సోదరికి విడాకులు ఇచ్చారని పేర్కొన్న అమ్రీన్ ఇప్పుడు భర్తకు తలాక్ చెప్పి పగ తీర్చుకున్నానని పేర్కొంది. అయితే అమ్రీన్ తలాక్ చెల్లదని మీరట్ ప్రధాన ఖాజీ జెనూర్ రషిదీన్ స్పష్టం చేశారు. విడాకులు కావాలనుకుంటే షరియత్ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.