: మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో లిటరేచర్ మెషీన్... అందుబాటులోకి వస్తే అద్భుతమే!
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అచ్చం మనిషిని పోలిన అప్లికేషన్‌ను అభివృద్ది చేసే పనిలో బిజీగా ఉంది. అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించి, ఎవరు ఏమడిగినా ఠక్కున సమాధానం చెప్పేలా అప్లికేషన్‌ను రూపొందిస్తోంది. లిటరేచర్ మెషీన్‌గా పిలిచే ఈ అప్లికేషన్ అందుబాటులోకి వస్తే అద్భుతమేనని చెబుతున్నారు. మనం ఏదైనా విషయాన్ని గురించి అడిగినప్పుడు అది వెంటనే స్పందించి సమాధానాలు చెబుతుందట. మాటల్లో కావాలంటే మాటల్లో.. రాతల్లో కావాలంటే లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తుందట. మనం అడిగే ప్రశ్న తనకు అర్థం కాకపోయినా, అనుమానాలున్నా తిరిగి ప్రశ్నిస్తుందట.
ప్రస్తుతం ఈ అప్లికేషన్ అభివృద్ధిలో తమ నిపుణులు బిజీగా ఉన్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చింజన్ 'బింగ్'లో ఏదైనా ప్రదేశం గురించి సెర్చ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మరింత సమాచారం కోరి ప్రశ్నలడిగితే వెంటనే బదులిస్తుందట. అలాగే ఫలానా దగ్గరికి ఎలా వెళ్లాలి? అక్కడి సమయాలు ఏంటి? అన్న ప్రశ్నలకు కూడా ఈ లిటరేచర్ మెషీన్ సమాధానమిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ అప్లికేషన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది.