: నేడు సరికొత్త చరిత్రను సొంతం చేసుకోనున్న 'బాహుబలి'!
జక్కన్న చిత్రరాజం 'బాహుబలి: ది కన్ క్లూజన్' నేడు రూ. 1000 కోట్ల కలెక్షన్ మార్కును అందుకోనుంది. పది రోజుల క్రితం వెండితెరలను తాకిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ. 925 కోట్లను వసూలు చేయగా, నేటి కలెక్షన్లతో రూ. 1000 కోట్ల అరుదైన మార్క్ ను తాకి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించనుందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానించారు. ఈ చిత్రం ఇండియాలో రూ. 745 కోట్లను, విదేశాల్లో రూ. 180 కోట్లను వసూలు చేసింది.
వసూళ్ల సునామీ మరో వారం పాటు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రూ. 1000 కోట్ల వసూళ్ల పైనే విశ్లేషిస్తూ కూర్చున్న వారంతా ఇప్పుడు రూ. 1500 కోట్ల మార్క్ వైపు చూస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు అంతకన్నా ఎక్కువే ఉంటాయని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. వేసవి సెలవులతో పాటు పోటీలో చిత్రాలేమీ లేకపోవడంతో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ వున్నట్టు తెలుస్తోంది.