: మిర్చి కొనుగోలులో రాష్ట్రాల మధ్య వివక్ష ఎందుకు?: ‘కేంద్రం’పై మండిపడ్డ పవన్ కల్యాణ్
మిర్చి కొనుగోలులో రాష్ట్రాల మధ్య వివక్ష ఎందుకు చూపుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మిర్చికి మద్దతు ధరగా ఐదు వేల రూపాయలను కేంద్రం ప్రకటించడం శోచనీయం. రైతు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోరాదు. పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో సబ్సిడీలుగా అందిస్తూ వారికి వెన్నదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వాలు, మరి రైతుల దగ్గరకు వచ్చే సరికి వారు కుంగిపోతున్నా ఎందుకు కరుణ చూపడం లేదు?
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మిర్చి కొనుగోలులో వివక్ష చూపడం తగదు. ఆంధ్రప్రదేశ్ లో 88,300 మెట్రిక్ టన్నులు కొంటున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబు? తెలంగాణ రైతుల వద్ద ఇంకా లక్షల టన్నుల సరుకు ఉందన్న సంగతి పాలకులు గుర్తించాలి. రెండు రాష్ట్రాలను సమానంగా చూడండి. తెలుగు ప్రజల మధ్య తగవులు పెట్టవద్దని జనసేన కోరుతోంది. రెండు రాష్ట్రాలలోను మద్దతు ధరను పెంచి, తెలంగాణలో కూడా 88,300 మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాలని జనసేన డిమాండ్ చేస్తోంది’ అని ఆ ప్రకటనలో కోరారు.