: సౌదీ రాజు సంచలన ప్రకటన...సౌదీ యువతుల్లో ఆనందం
సౌదీ అరేబియా యువతులకు ఆ దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ శుభవార్త వినిపించారు. ముస్లిం సంప్రదాయాలు కఠినంగా అమలు చేసే సౌదీ అరేబియాలో బుర్ఖా తొలగించడం, సంరక్షకుడి అనుమతి లేకుండా విధులు నిర్వర్తించడం మహానేరం. ఇకపై ఇలాంటి కఠిన నిబంధనల అమలుపై సడలింపు ఉంటుందని సౌదీ రాజు ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకపై అమ్మాయిలు ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా డబ్బు సంపాదించుకుని, గౌరవంగా జీవించే హక్కు కల్పిస్తున్నామని తెలిపారు. స్థానిక పత్రికల్లో వచ్చిన ఈ ప్రకటనలో ఇంకా ఏమన్నారంటే... సౌదీ యువతులకు ప్రభుత్వ సేవా సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రైవేటు సంస్థలు కూడా యువతులకు ఉద్యోగాలివ్వచ్చని సూచించారు. దీనికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంతకం కూడా అవసరం లేదని, వారి ఆమోదం ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల్లో ఈ విషయం ఇస్లాం చట్టాల్లో పొందుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయన్ని ఒక్క ఆదేశంతో రాజు మార్చేశారని పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే అలా ఉద్యోగం ఇచ్చిన సంస్థే... ఆ యువతులకు తగిన రవాణా సౌకర్యం కూడా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. సౌదీలో మహిళలు కారు నడపడం నిషేధం కనుక..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.