: హరీష్ రావూ!... బహిరంగ చర్చకు సిద్ధమా?: కిషన్ రెడ్డి సవాల్
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కేంద్రం మిర్చికి మద్దతు ధర ప్రకటించిందని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అబద్ధాలు చెబుతోందని అన్నారు. ఖమ్మంలో అరెస్టైన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్రం 7,900 కోట్ల రూపాయలు ఇస్తే..వాటిని సొంత అవసరాలకు వాడుకున్న టీఆర్ఎస్ నేతలు రైతుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని అన్నారు. మార్కెట్ యార్డులో దాడులు చేసింది రైతులు కాదని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే రైతులను మాత్రం అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.
ఖమ్మం మార్కెట్ యార్డులో ఈనాం కార్యాలయంపై మార్కెట్ యార్డు వ్యాపారులు దాడులు చేశారని అన్నారు. ఈ కొత్త విధానం వల్ల ఇతర ప్రాంతాల్లో తాము విక్రయిస్తున్న పంట ధర తెలిసిపోతుండడంతో వ్యాపారులు రైతులను మోసం చేయడానికి కుదరడం లేదని, అందుకే ఆ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. రైతులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మిర్చికి కేంద్రం నిధులు, మద్దతు ధరపై బహిరంగ చర్చకు ఖమ్మం మార్కెట్ యార్డులో సిద్ధంగా ఉంటానని, హరీష్ రావుకు ఆ దమ్ముందా? అని ఆయన సవాలు విసిరారు.