: విభజన సమయంలో ఎంతో ఒత్తిడికి గురయ్యా: గవర్నర్ నరసింహన్
ఏపీ విభజన సమయంలో తానెంతో ఒత్తిడికి గురయ్యానని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘విభజన సమయంలో రాత్రుళ్లు నిద్ర కూడా పట్టేది కాదు. తెల్లారి లేచాక..హమ్మయ్య నిన్న గడిచిపోయింది అనుకునేవాడిని. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు గడచిన అధ్యాయం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేస్తాయి. నేను గవర్నర్ గా వచ్చినప్పుడు ఎంతో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో శాంతి భద్రతలపై పోలీసు అధికారులకు మార్గనిర్దేశం చేశాను. నాగార్జునసాగర్ వివాదం తలెత్తినప్పుడు ఇద్దరు సీఎంలను పిలిచి మాట్లాడా...హైదరాబాద్ లో భద్రతపై అందరూ భయపడ్డారు..ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి. రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లడం సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.