: బిల్కిస్ బానో అత్యాచారం కేసు... దోషులకు మరణదండన విధించేందుకు హైకోర్టు నిరాకరణ.. యావజ్జీవ శిక్ష ఖరారు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో నిందితులకు మరణదండన విధించాలన్న సీబీఐ పిటిషన్ ను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు, 11 మందికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను కొనసాగించాలని తీర్పిచ్చింది. ఈ కేసులో కీలక నిందితులైన జస్వంత్ నాయ్, గోవింద నాయ్ లకు మరణశిక్ష విధించాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని నిరాకరించింది.
2002లో గోద్రా అల్లర్ల తరువాత అహ్మదాబాద్ సమీపంలోని రాందిక్ పూర్ గ్రామనికి చెందిన బానో ఇంటిలోకి చొరబడిన నిరసనకారులు, నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడి, ఎనిమిది మంది కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేయడం జరిగింది. బిల్కిస్ మరో ఇద్దరు మాత్రం బతికి బట్టకట్టారు. అప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు.
ఈ కేసును విచారించిన ముంబై ప్రత్యేక కోర్టు 2008లో తీర్పును వెలువరిస్తూ, 12 మందిని నిందితులని తేలుస్తూ, 11 మందికి యావజ్జీవ శిక్షను విధించింది. మరో ఏడుగురిని సాక్ష్యాలు లేని కారణంగా వదిలేసింది. తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం కేసు పునర్విచారణ బాధ్యతలను బాంబే హైకోర్టుకు అప్పగించింది.