: ముందుగా నేతలను చంపేయండి: మావోయిస్టులకు ఎంపీ పప్పూ యాదవ్ సలహా
జన అధికార్ పార్టీ ఎంపీ, ఇటీవలి వరకూ జైల్లో కాలం గడిపి, ఈ మధ్యే బయటకు వచ్చిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ మావోయిస్టులకు ఓ సలహా ఇచ్చారు. హాజీపూర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ, భద్రతా దళాల సిబ్బందిపై దాడులు వద్దని, అంతకన్నా ముందుగా నాయకులను హత్య చేయాలని సూచించారు. దేశాన్ని దోచుకుంటున్నది నాయకులేనని, సైన్యం దేశ రక్షణ బాధ్యతల్లో ఉందని ఆయన అన్నారు. నోట్ల రద్దు తరువాత దేశంలో తీవ్రవాదం తగ్గిందని ప్రధాని మోదీ చెబుతుండటాన్ని ఆయన గుర్తు చేశారు. అసలు మావోయిస్టుల దాడులు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. కాగా, గతంలో ఆర్జేడీ పార్టీలో ఉండి, ఆపై బహిష్కరించబడిన ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే.