: 'భగవంతుడా, జగన్ కు మంచి బుద్ధిని ప్రసాదించు' అంటూ టీడీపీ నేతల గణపతి హోమం
వైసీపీ అధినేత జగన్ కు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ టీడీపీ నేతలు గణపతి హోమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఈ హోమాన్ని నిర్వహించారు. నవ్యాంధ్ర నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు జగన్ కుటిల యత్నాలు చేస్తున్నారని... ఈ కుతంత్రాలకు అడ్డుకట్ట వేసి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని దేవుడిని కోరుకున్నారు. స్థానిక లయన్స్ కాంప్లెక్స్ వద్ద ఈ హోమం జరిగింది. పురోహితుడు వేమూరి శ్రీనివాస్ శాస్త్రోక్తంగా గణపతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలతో పాటు స్థానిక రైతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవీ వ్యామోహంతోనే జగన్ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. దీక్షల పేరుతో ప్రజల్లో అలజడి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేస్తున్న తప్పిదాలను ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు.