: జయలలిత ఆస్తుల వీలునామా అపహరణ? నగలు, నగదు కూడా..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వీలునామా అపహరణకు గురైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 23వ తేదీన గుర్తు తెలియని 11 మంది వ్యక్తులు జయకు చెందిన కొడనాడు ఎస్టేట్ లోకి చొరబడి ఓ సెక్యూరిటీ గార్డును హతమార్చారు. అనంతరం, ఎస్టేట్ అద్దాలు పగలగొట్టి, లోపల ఉన్న నగదు, నగలు, కొన్ని కీలక డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని సమాచారం. ఎస్టేట్ లోని జయ పర్సనల్ రూమ్ లో మూడు సూట్ కేసులు పగులగొట్టిన స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉండటంతో... చోరీ జరిగినట్టు అనుమానిస్తున్నారు. దుండుగులు ఎత్తుకెళ్లిన వాటిలో జయ ఆస్తుల వీలునామా కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, జయకు చెందిన ఐదు చేతి గడియారాలు మాత్రమే చోరీ అయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ దోపిడీకి ప్లాన్ వేసిన జయ మాజీ డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ దోపిడీలో పాల్గొన్న ఒక వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రూ. 200 కోట్ల విలువైన సొత్తుతో పాటు, జయ వీలునామా కూడా అపహరణకు గురైనట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల విలువ చేసే తన ఆస్తులను తన మరణానంతరం ఏమి చేయాలనే విషయాన్ని జయ తన వీలునామాలో సవివరంగా రాసినట్టు భావిస్తున్నారు.