: హిల్ స్టేషన్ లో ల్యాండ్ మాఫియా పాలిట సింహస్వప్నంగా మారిన ఐఏఎస్...ప్రజాప్రతినిధుల మండిపాటు


కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ వేసవి విడిదికి ఎంతో అనువైన ప్రదేశం. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉండడానికి తోడు కేరళ వాతావరణం దీనికి మరింత అదనపు ఆకర్షణగా మారింది. దీంతో ఇక్కడికి ప్రతి ఏటా టూరిస్టులు పోటెత్తుతారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు స్థానిక నేతలు, వారి అనుచరులు నడుం బిగించారు. దీంతో ల్యాండ్ మాఫియా జడలు విప్పింది. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు రిసార్టో, హోటలో వెలసేది. స్థలం ఇంకాస్త పెద్దదైతే...అక్కడ ఏకంగా వాణిజ్య సముదాయమే లేచేది. దీనికి ఒక పార్టీని నిందించడానికి లేదు. కేరళలోని అన్ని పార్టీల నేతలకు ఇది మామూలే... 2016 జూలై వరకు ఇదే దందా కొనసాగింది. ఆ తరువాత 2013లో సివిల్ సర్వీసెస్ లో సెకెండ్ ర్యాంక్ సాధించిన కేరళవాసి శ్రీరామ్ వెంటకట్రామన్ దేవికుళం సబ్‌ కలెక్టర్‌ గా బాధ్యతలు స్వీకరించాడు.

చూసేందుకు బక్కపలచగా, గుబురు గడ్డంతో ఉంటాడు. కానీ మనిషి మహా మొండోడని ప్రజా ప్రతినిధులు చెబుతుంటారు. సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ల్యాండ్ మాఫియా తీరుతెన్నులు గమనించారు. ఇది సరికాదని కార్యోన్ముఖుడయ్యారు. పార్టీ యంత్రాంగం, ట్రేడ్‌ యూనియన్లు బలంగా ఉండే ఈ ప్రాంతంలో నిరసనలు, భౌతిక దాడుల బెదిరింపులు, దూషణలు అన్నీ ఎదుర్కొన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేవేసి బోర్డులు పాతారు...నిబంధనలు మీరితే జైలుకేనని హెచ్చరించే బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలన్నీ స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ల్యాండ్ మాఫియా నకిలీ పత్రాలతో హైకోర్టులో పిటిషన్లు వేసినా వెనుదిరగలేదు. పక్కా ఆధారాలతో సహా వారు తప్పుచేస్తున్నారని నిరూపించేవారు. పోలీసులు సహకరించకపోయినా ఆయన ఏవర్నీ తప్పుపట్టలేదు. స్థానికులనే సైన్యంగా చేసుకుని ఆయన ల్యాండ్ మాఫియా ఆటకట్టించారు.

ప్రభుత్వ భూమిలో దేవాలయం, చర్చి, మసీదు ఏదైనా ఒకటే న్యాయం, ఒకటే చట్టం...చట్టప్రకారం ఆయన పని చేసుకుపోతారు. దీంతో కేరళ విద్యుత్ శాఖ మంత్రి కేకే.మణి మాట్లాడుతూ, చర్చిలు, దేవాలయాలు, మసీదులు ఎన్నో పట్టాలేని భూముల్లో ఉన్నాయి. వీటిని తొలగించొచ్చని ఓ మూర్ఖపు సబ్‌ కలెక్టర్‌ అనుకుంటే... అతన్ని పిచ్చాసుపత్రికి పంపాల్సిందే అని వ్యాఖ్యానించారంటే శ్రీరామ్ వెంకట్రామన్ పని ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

ఆయన పనితీరుపై అఖిలపక్షం వేయాలంటూ అధికారపక్షం నేతలు సీఎంపై ఒత్తిడి తెస్తుండగా, సీఎం మౌనంగా ఉన్నారు. కాగా, అవినీతి వ్యవహారాలు, ఒత్తిళ్లపై శ్రీరామ్ వెంకట్రామన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులన్నాక ట్రాన్స్ ఫర్ లు సర్వసాధరాణమే... ఎక్కడైనా ఉద్యోగం చేయడమే ముఖ్యం అంటున్నారు. పవిత్రమైన డాక్టర్ విధులను పక్కన పెట్టి...ప్రజలకు సేవ చేసేందుకు సివిల్స్ ఎంచుకున్నానని ఆయన చెబుతున్నారు. ఆయనకు ఆ జిల్లాలో విశేషమైన అభిమానులున్నారు.

  • Loading...

More Telugu News