: అమెరికాలో బోటు ప్రమాదం.. కనిగిరి ఎమ్మెల్యే బాబురావు మేనల్లుడి మృతి
అమెరికాలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు మేనల్లుడు అల్లు దినేశ్ మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాబురావు సోదరి కుమారుడైన దినేశ్ విజయవాడలో వజ్రాల వ్యాపారం చేస్తుంటారు. అమెరికాలో ఉంటున్న దినేశ్ భార్య ప్రనూష సింహాద్రి బంధువుల పిలుపు మేరకు దినేశ్ దంపతులు ఇటీవల అమెరికా వెళ్లారు. సోమవారం ఎమ్మెల్యే బాబురావు కుమార్తె యశస్విని, కుమారుడు భువనేష్, దినేశ్ దంపతులు కలిసి రాయల్ గోర్గే ర్యాప్టింగ్ నది ప్రాంతంలో బోటులో షికారుకు వెళ్లారు. కాసేపటి తర్వాత బోటు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దినేశ్ మృతి చెందగా మిగతా వారిని పక్కనే ఉన్న గైడ్స్ రక్షించారు. దినేశ్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. దుర్ఘటన విషయం తెలిసిన ఎమ్మెల్యే కుటుంబంలో విషాదం అలముకుంది.